Friday, October 30, 2009

ద ఫౌంటెన్‌హెడ్

ద ఫౌంటెన్‌హెడ్
"కొత్తవి సృష్టించలేము, పాతవాటిని అనుసరించి మాత్రమే ముందుకెళ్ళగలం" అనే సిద్దాంతాన్ని వ్యతిరేకించినందుకు, కధానాయకుడు Roarkని, ఆర్కిటెక్చర్ స్కూల్ నుంచి తొలగించడంతో, కథ మొదలవుతుంది. ఓ స్వతంత్రభావాలు నిండిన పాత్రగా, ఇక్కడ రోయార్క్‌ను పరిచయం చేస్తుంది రచయిత్రి. అమెరికన్ సమాజంలో, డిగ్రీదాకా వచ్చి, దాన్ని వదిలేసుకోలంటే, మామూలు విషయం కాదు. అదీ కేవలం భావవ్యతిరేకత వల్లే వదులు కోవడమంటే, అంత చిన్న విషయం కాదు. ఇక్కడే వచ్చే, ఇంకో ముఖ్యపాత్ర - Peter Keating. మామూలు భాషలో చెప్పాలంటే వెన్నెముక లేనివాడు. మెత్తగానే ఉంటూ, పనులు చేసినట్టే కనిపిస్తూ, ఎదుటివాళ్ళని నిచ్చెనగా చేసుకుని, ఎలా పైకి ఎదగొచ్చో, ఈ కీటింగ్ ద్వారా రచయిత్రి చెబుతుంది. ఇవి రెండూ నవలలో ముఖ్య పాత్రలు. స్కాలర్‍షిప్‍తో చదువును సాగించటమా, లేక ఉద్యోగం చేయడమా అనేది తేల్చుకోలేని కీటింగ్, రోయార్క్‌ని సంప్రదించి ఉద్యోగంలో చేరతాడు.

ఏ సభ్యసమాజంలోనైనా, పోలీసింగ్ లేదా వాచ్‌డాగ్ (పేరేదైతేనే) అనేది ఉంటుంది. అంటే, సమాజంలో ఉన్న వివిధ వృత్తులన్నంటిలోనూ, మంచి-చెడ్డలు ఉంటాయి. వాటిని గమనించడాలూ, వాటిని మీడియాలో ప్రకటించడాలూ ఉంటాయి. ఇది అమెరికాలోఐతే, ఇంకా ఎక్కువ. మీడియా తన ప్రభావంతో ఈ సమాజంపై పట్టు ఎలా సాధిస్తుందనేది, టూయీ (Ellsworth Toohey) అనే రచయత పాత్ర ద్వారా, రచయిత్రి మనకు చెబుతుంది. ఈయన మేనకోడలూ, ఆమెకు కీటింగ్‍‌తో ఉండే చిన్నపాటి అఫైరు - ఇంకో పిట్టకధ .

మధ్యలో వచ్చే మరో ముఖ్య పాత్ర - గైల్ వైనాండ్ (Gail Wynand). ఇతను ఓ పత్రికాధిపతి. అతని పత్రిక పేరు - "New York Banner". కథలో సగభాగం వరకూ కనబడకపోయినా, అంతర్లీనంగా కథాగమనాన్ని శాశించే పాత్ర ఇది. ఆ అంశంలో రాండ్ ప్రతిభ ప్రశంసించ దగ్గది.

ఫ్రాంకన్ అండ్ హేయర్ (Francon & Heyer) అనే కంపనీలో కీటింగ్ అనుభవాల ద్వారా, ఒక్క ప్లాను గూడా గియ్యకుండా కేవలం కంపెనీ బ్రాండ్ నేమ్ ఉపయోగించుకుని ఎలా నడిపేస్తారో, నడపవచ్చో రచయిత్రి చెబుతుంది. మరో పక్క, మన హీరో, హెన్రీ కామెరన్ (Henry Cameron) అనే ఒక తాగుబోతు దగ్గర పనికి కుదురుతాడు. డిగ్రీ లేకుండా పని ఇవ్వాలంటే, ఎంతో కొంత నలుగురి కంటే భిన్నంగా అలోచించే వాడై ఉండాలి. Henry Cameron సరిగ్గా అలాంటి వాడే. గత వైభవం తప్ప ఇంకేమీ మిగలని విఖ్యాత architect.

కొన్ని కారణాల వల్ల, Henry Cameron ఆఫీసు మూత పడిపోతుంది. తప్పని సరై, కీటింగ్ ఆఫీసులోనే రోయార్క్‌ కూడా పనిలో చేరతాడు. ఒక రోజు, నిర్మాణంలో ఉన్న ఓ భవంతి పనులు చూడటానికి వెళ్ళిన రోయార్క్‌కి, మైక్ అనే ప్లంబర్‌తో పరిచయం ఔతుంది. రోయార్క్‌ సొంత ఆలోచనలూ, సొంత నిర్ణయాలూ, ఏదేని నచ్చని విషయాన్ని వ్యతిరేకించే స్వభావం, ఇవన్నీ మైక్‌ని ఆకట్టుకుంటాయి. కానీ, వీటివల్లే రోయార్క్‌ ఉద్యోగం కోల్పోతాడు.

ఇలా స్కూల్ నుంచీ, ఉద్యోగం నుంచీ గెంటివెయ్యబడ్డ హీరోకి , మళ్ళీ ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. ఎన్నో ప్రయత్నాల తరవాత జాన్ ఎరిక్ స్నైట్ (Jan EriK Snyte) అనే పెద్దమనిషి ఉద్యోగమిస్తాడు. అతని కింద ఓ ఐదుగురు విభిన్నమైన డిజైనర్లు పనిచేస్తుంటారు. వీరి మధ్య ఓ నిరంతరంమైన పోటీ ఉంటుంది. అందరి డిజైన్లనూ చూసి, ఆఖరుకు తనకు నచ్చినదేదో ఒక్కదాన్నే, స్నైట్ ఎన్నుకుంటాడు. ఐతే, తన డిజైన్‌ని ఎన్నుకోకపోయినా, తాను చేసిన దానిని మార్చకపోవడం వల్ల, రోయార్క్‌కి ఈ ఉద్యోగం మంచి సంతృప్తినిస్తుంది. ఇలా ఉండగా, ఒకసారి హెల్లర్ (Heller) అనే వ్యక్తి ఇచ్చిన పనుల్లో, రోయార్క్‌ చేసిన డిజైన్‌ని, ఎన్నుకుంటారు. అప్పుడు జరిగిన ఓ సంఘటనతో, రోయార్క్‌ ఉద్యోగం మానేసి, సొంత ఆఫీసు తెరుస్తాడు.

మరో పక్క ట్రేడు యూనియన్లూ, కాంట్రాక్టర్ల గొడవ మొదలవుతుంది. కీటింగు‌కి, అప్పుడే "టూయీ"తో పరిచయమౌతుంది. అవి సద్దుమణిగాక, కధలోకి హీరోయిను పాత్ర వస్తుంది. ఆమె పేరు - డామినిక్ ఫ్రాంకన్(Dominique Francon). ఈమె Francon & Heyersలో Francon గారి కుమార్తె. ఈ పాత్ర వస్తూనే, ఫ్రాంకన్ కంపనీలో కీటింగ్ వేసిన డిజైనుని, "న్యూయార్క్ బేనర్" పత్రికలో ఘాటుగా విమర్శిస్తూ ప్రవేశిస్తుంది. దేనినీ ఆశ పడని మనస్తత్వం ఆమెది. ఏదైనా ఆశ పడితే, దానికోసం మనిషి లొంగిపోవలసి వస్తుందని, ఆమె అభిప్రాయం. తండ్రికి ఆమె స్వభావం అంత నచ్చదు. ఐతే, "డాడీ" అని అరుస్తూ, ఫెన్సు మీద నుండి దూకే తన చిట్టితల్లి స్మృతిపధంలో మెదిలినప్పుడల్లా, ఆ తండ్రికి కూతురిపై కోపం చప్పున చల్లారి పోతుంది.

అటువైపు, సొంత ఆఫీసు తెరిచిన రోయార్క్‌, తన మొదటి అసైన్‌మెంటు ఐన Heller House నిర్మాణం కోసం, తిరిగి కామెరన్‌ని కలుస్తాడు. కామెరన్ కూడా, ఎలాంటి మాటా లేకుండా, స్నాప్ షాట్స్ తెమ్మంటూ పని ఒప్పేసుకుంటాడు. కొలోనియల్ స్టైల్లో పూర్తిచేసిన ఆ హెల్లర్ ఇల్లు చూసుకోడానికి రోయార్క్‌ వెళ్ళినప్పుడు, మళ్ళీ మైక్ ఎదురౌతాడు. "నీ దగ్గర పని ఉంటే, నేనెప్పుడైనా రెడీ" అన్న మైక్‌తో, రోయార్క్‌కి ఓ చిరకాల స్నేహం కుదురుతుంది. తనకి వచ్చిన అవకాశాలని, చాలా వాటిని రోయార్క్‌ తిరగ్గొడతాడు. పాతవాటిని తిరిగి నిర్మించడానికి, అతను సమ్మతించడు. వాటిని "ఙ్ఞాపకాలు" గా భావిస్తుంటాడు. బాగా కష్టపడి, కొంతమేర తనజేబులోని డబుపెట్టి మరీ ఆ ఇల్లు పూర్తిచేస్తాడు. ఐతే కట్టించుకున్న ఆసామీ బదులుగా, అతని కుమారుడు ఆ ఇంట్లో ఉంటాడు. మనవాడి రెజ్యూమేలో, ’పోటీకి పనికిరాడ’నే మరో విశేషణం జోడవుతుంది.

Heller House తరువాత, పని తగ్గిపోయి,అవకాశాలు మృగ్యమై, బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఉన్న రోయార్క్‌కి, మళ్ళీ Cameron వద్ద నుండి పిలుపు వస్తుంది. అసలు వర్గశత్రువు వైనాండ్ అని, తను పోరాడాల్సింది వైనాండ్‌తోనేనని చెప్పి, Cameron కన్ను మూస్తాడు. తరువాత, కన్నెక్టికట్‌లోని ఒక గ్రానైటు క్వారీలో చిన్న ఉద్యోగం కోసం, మైక్ సాయం చేస్తాడు. అలా రోయార్క్‌కి కొత్త కొలువు దొరుకుతుంది.

ఇదే సమయానికి కీటింగ్ చాలా ధనవంతుడైపోతాడు. ఫ్రాంకన్‌ నుంచీ వెళ్ళిపోయే ముందు, రోయార్క్‌ కొన్ని డిజైన్సు చేస్తాడు. వాటినే వాడుకొని, తనకు తోచిన విధంగా అలంకరించి, వాటిని సొంత డిజైన్లుగా కీటింగ్ ప్రచారం చేసుకుంటాడు. ఆ డిజైన్లు విజయవంతమవ్వటంతో, కీటింగ్ ఫ్రాంకన్‌లోనే భాగస్తుడైపోతాడు. ఇదంతా పూర్వార్ధం.

ఓసారి డామినిక్, వేసవి సెలవలకై, కనెక్టికట్‌కి వస్తుంది . ఇక్కడే డామినిక్ మొదటసారి రోయార్క్‌ ను చూస్తుంది. ఇద్దరికీ ముఖపరిచయాలు ఏర్పడతాయి. ఐతే అతనెవరో, ఆమెకు తెలీదు. కనీసం పేరు కూడా తెలుసుకోదు. అతను కూడా, ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నమేమి చెయ్యడు. ఇంతలో Roger Enright అనే వ్యక్తి నుంచి కమిషను అందటంతో, రోయార్క్‌ తిరిగి న్యూయార్క్ చేరుకుంటాడు. అక్కడ, ఒక పార్టీలో డామినిక్‌కి మళ్ళీ పరిచయమవుతాడు. వీళ్ళిద్దరి మధ్య ఒకలాంటి లవ్-హేట్ సంబంధం ఏర్పడుతుంది. చూసేవాళ్ళ దృష్టిలో వీళ్ళిద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే అభిప్రాయం కలుగుతుంది

మెల్లగా రోయార్క్‌ ఆఫీసు పని పుంజుకుంటుంది. ఒకే సమయంలొ నాలుగైదు కమిషన్లు దొరికిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇంతలో Hopton Stoddard (హాప్టన్ స్టాడర్డ్) అనే వ్యక్తి నిర్మించదల్చిన Stodard Temple కాంట్రాక్ట్ కూడా వస్తుంది. ఆ టెంపుల్‌కి అవసరమైన శిల్పం కోసం, తనలాంటి భావజాలమున్న శిల్పినే, రోయార్క్‌ పెట్టుకుంటాడు. ఆ శిల్పితో స్నేహం కూడా చివరిదాకా ఉంటుంది. ఈ శిల్పానికి మోడల్‌గా, డామినిక్‌ పనిజేస్తుంది. అమెరికన్ సమాజంలో షేరు మార్కెట్ ప్రభావం ఎంత వుందో కూడా, కధానుగుణంగా ఇక్కడ చర్చిస్తుంది రచయిత్రి. ఐతే ఈ టెంపుల్, సదరు Stodard గారికి నచ్చక, చెప్పినట్లు కట్టలేదని కోర్టులో కేసు వేస్తాడు. రోయార్క్‌ కేసు ఓడిపోవడంతో, మళ్ళా మొదటి స్థాయి కొచ్చేస్తాడు. కొన్ని విశదీకరించలేని సన్నివేశాలనంతరం, కీటింగ్‌ను డామినిక్ పెళ్ళి చేసుకుంటుంది. (ఆ జరిగిన సందర్భాన్ని, అందులోని ఆంతర్యాన్ని, ఎవరికి వారు చదువుకొని అర్థం చేసుకోవాలే కానీ, ఒకరు చెపితే అర్థమయ్యే విషయం కాదు కనుక, ఇక్కడ చెప్పటం లేదు).

ఇప్పుడు, కధలోకి పత్రికాధిపతి "వైనాండ్" ప్రవేశిస్తాడు. కీటింగుకి కమిషన్లు కాస్త తక్కువౌతాయి. టూయీ సహాయ సలహాలతో, డామనిక్ రూపంలో చేసిన స్టాడర్డ్ టెంపుల్లోని శిల్పాన్ని, వైనాండ్‌కి బహుమతిగా ఇచ్చి, ఒప్పించి, కీటింగు ఓ కాంట్రాక్టుని దక్కించుకుంటాడు. అలా డామినిక్‌‌కీ, వైనాండ్‌కి పరిచయం అవుతుంది. ఒప్పందం ప్రకారం, కీటింగు తన భార్య డామనిక్‌ను, వైనాండ్‌కు అప్పచెప్పేస్తాడు

Wynand yacht మీద, అతనితో డామినిక్ రెండు నెలలు క్రూజ్‌‌కి వెళ్తుంది. ఆ యాచ్ పేరు "I Do". పడవ ప్రయాణానికి ముందు, డామినిక్‌‌ని తిప్పుతూ, తన ఆర్ట్‌గాలరీనంతా చూపిస్తాడు. ఒక వారం కలిసి కబుర్లాడుతూ యాచ్ మీద గడిపాక, పెళ్ళి ప్రస్తావన తీసుకొస్తాడు. వైనాండ్‌ను పెళ్ళి చేసుకోవడానికి డామినిక్ ఒప్పుకుంటుంది. కీటింగ్‌కు విడాకులిచ్చి, ఓ 600 మంది ఆహతులు మధ్య వివాహం చేసుకుంటుంది. ఒక డైవర్సీని వైనాండ్ పెళ్ళి చేసుకున్నందుకు, మీడియా అంతా కోడై కూస్తుంది. డామినిక్ - వైనాండ్ల మధ్య మాటల్లో, ’ఇది కూడా మనసులేని కాపురమే’ అని డామినిక్ నిజాయితీగా ఒప్పుకుంటుంది. అంతే నిజాయితీతో వైనాండ్‌ స్పందిస్తాడు, "నేను నా ప్రేమ గురించి మాత్రమే అలోచించాను" అంటాడు.

ఇదిలా నడుస్తుండగా, రోయార్క్‌‍కు ఒక రెసార్ట్ వర్క్ దొరుకుతుంది. రెండేళ్ళు ఖాళీ లేకుండా పనిచేస్తాడు. ఐతే ఈ రెసార్ట్ గురుంచి ప్రచారం ఉండదు. కట్టించేవాళ్ళు, ఆ రిసార్ట్‌ని అధిక లాభాలకి అమ్మేసి, దివాళా తీసేసినట్టు చెప్పి, మోసంచేసే పనిలో ఉంటారు. ఆ వ్యూహంలో, ఓ పనికిమాలిన architectగా, వాళ్ళు రోయార్క్‌ను ఎంచుకుంటారు.

ఓసారి రోయార్క్‌ని కలవాలంటూ, వైనాండ్ ఓ పిలుపు పంపిస్తాడు. కలవగానే, కళ్ళతోనే ఇద్దరూ ఒకరినొకరు అంచనా వేసుకుంటారు. వైనాండ్ తన భార్య కోసం ఒక భవనాన్ని కట్టించాలని కోరుకుంటున్నట్టు చెబుతాడు. ఆ భవన నిర్మాణంలో రోయార్కు ప్రతిభ ప్రతిబించించాలని, తద్వారా రోయార్క్ ప్రతిభకీ, ప్రపంచానికీ మధ్యా మరే విధమైన అడ్డుగోడలూ ఉండకూడదని చెబుతాడు.

ఇద్దరూ భవంతి కట్టాల్సిన స్థలానికి, డ్రాయింగులతో వెళ్తారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. రోయార్క్‌ను వైనాండ్ ఇంటికి ఆహ్వానించి, భార్యను చూపిస్తాడు. తర్వాత తనే కొన్నిసార్లు స్వయంగా రోయార్క్‌ ఆఫీసుకు వెళతాడు. తన స్టాఫ్‌ను పిలిచి, రోయార్క్‌కు వ్యతిరేకంగా పత్రికలో ఏమీ రాయొద్దని చెబుతాడు. భవనంతో పాటూ, ఇలా ఇద్దరి పరిచయం పెరుగుతూ ఉంటుంది. నిర్మాణం పూర్తవుతుంది. డామినిక్ అందులో నివాసం మొదలుపెడ్తుంది. ఇంతలో, టూయీ వల్ల, వైనాండ్ పేపరు గురించి, జనంలో వ్యతిరేకత ప్రబలుతుంది. పీటర్ కీటింగ్ తన అవకాశవాదాన్ని మరలా బైటపెట్టుకుంటాడు. ఈసారి Catherine (టూయీ మేన కోడలు, అతని తొలి ప్రేయసి)ను ప్రపోజ్ చేస్తాడు. ఐతే ఆమె కూడా మెత్తని చెప్పుతో కొడుతుంది.

కధ నడుస్తూనే ఉంటుంది. ఓ పక్క పేపరులో గొడవలు పెంచేసి, అవకాశం కోసం ఎదురుచుస్తుంటాడు టూయీ. మరో పక్క, ఇదే టూయీ ద్వారా, కీటింగ్ ఓ ప్రాజెక్టు సంపాదించుకుంటాడు. Cartlandt హౌసింగ్ అనే ఆ ప్రభుత్వ ప్రాజెక్ట్ పనినంతా, రోయార్క్‌ చేసిపెడితే, కీటింగ్ తన పేరు పెట్టుకుంటాడు. రోయార్క్‌ కూడా, తానే రకంగా వేస్తాడో, అలాగే అది నిర్మింపబడాలన్న ఓ కండిషన్‌తో ఈ పని చేసిపెడతాడు. ఆ తరువాత వైనాండ్‌తో క్రూజ్‌పై వెళ్ళిపోతాడు. తిరిగొచ్చిన రోయార్క్‌, ఆ ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్ళి చూస్తే, కీటింగ్ నిస్సహాయత వల్ల అదంతా మార్పుచేర్పులకు గురైనట్లు తెలుసుకుంటాడు. డామినిక్ సహాయంతో, దాన్ని పేల్చేస్తాడు. పోలీసులు రోయార్క్‌ను అరెస్టు చేస్తారు. సమర్ధించబోయిన వైనాండ్‌పైన, టూయీ తిరుగుబాటు లేవదీసి లొంగదీస్తాడు.

బెయిలు పైన బయటకొచ్చిన వైనాండ్, రోయార్క్‌ వద్దకు వెళ్ళి, విషయం పత్రికలకెక్కేలా చేస్తాడు. "డామినక్‌కి విడాకులిస్తున్న వైనాండ్" అని ప్రచారం సాగిస్తాడు. దీనివల్ల, వైనాండ్ పేపర్ల సర్క్యులేషన్లు మళ్ళీ పెరుగుతాయి. ఆ పేల్చివేత కేసులో, జ్యూరీ ముందు రోయార్క్‌ తన వాదన వినిపిస్తాడు. ఆ వాదనలో "క్రియేటర్స్" గురించి, "సెకండ్ హాండర్స్" గురించీ, "Egoism" యొక్క అసలు అర్ధం ఏమిటో, అది ఎలా మంచిదో, స్వార్ధరాహిత్యం ఎలా హానికరమో వివరిస్తాడు. అతని వాదన విన్న జ్యూరీ మెబర్లంతా కలిసి, అతడు నిరపరాధి అని తీర్పునిస్తారు.

చివరికి :
డామినిక్‌కు వైనాండ్ విడాకులిస్తాడు.
Cartlandt projectని Enright సంపాదించి, రోయార్క్‌కే అప్పగిస్తాడు.
అప్పాయింట్మంట్ తీసుకొని రోయార్క్‌ దగ్గరకొచ్చి, వైనాండ్ సెక్రటరీ "వైనాండ్ బిల్డింగ్" కట్టేందుకు కాంట్రాక్ట్ ఇస్తుంది.

రోయార్క్‌ వ్యక్తిత్వం సంపూర్ణంగా అర్థం చేసుకున్న డామినిక్, తన లోపాల్ని సరిజేసుకొని, అతన్ని పెళ్ళాడుతుంది.
వైనాండ్ బిల్డింగ్ యొక్క నేము ప్లేటు మీద "Howard Roark, Architect" అన్న అక్షరాలని, సగర్వంగా చూసుకుంటుంది. అతని కోసం ఎలివేటర్లో పైకి వెళ్తూ కిందకి చూస్తే, కిందనున్నవన్నీ చిన్నచిన్నవిగా కనిపిస్తాయి. పైవైపు చూస్తే, ఆ ఒక్క కట్టడం రాజ సౌధంలా, ఠీవిగా, అంతెత్తుగా కనిపిస్తుంది.

ఇదీ కధ.

No comments:

Post a Comment