Wednesday, October 7, 2009

రాజాధిరాజ! రాజశేఖరా! రక్షించు!

అబ్రకదబ్ర ఆలోచనతో అంగీకరిస్తూ, కడప జిల్లాకి రాజశేఖర రెడ్డి పేరును పెట్టడాన్ని నిరసిస్తూ, ఈ పోస్టు రాస్తున్నాను.
ఈ పేరు మార్పిడిని ఎందుకు నిరసిస్తున్నాను!? :
౧. అబ్రకదబ్ర పోస్టులో చెప్పినట్టుగానే, "కడప" అన్న పేరుకీ ఓ సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది గాబట్టీ; ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా ఏదన్నా ప్రాధాన్యతని ఆపాదించి, దాన్ని "రాజశేఖర్ రెడ్డి లాంటి మహానాయకులు పుట్టిన గడ్డ ఇది" అని చెప్పుకోవడానికైతే అభ్యంతరం ఎవ్వరికీ ఉండదు గాబట్టి. ఇలా అన్ని జిల్లాల పేర్లూ మార్చుకుంటూ పోవటం ఏం బాగోలేదు గాబట్టి.

౨. అసలు, రాజశేకరుడు ఇంత పాపులారిటీలోకి వచ్చిందీ తన హయాంలోనే తెస్తానని జనాలకి ప్రమాణం చేసిన ప్రాజెక్టుల ఐడియాతో గాబట్టి, ఆయా ప్రాజెక్టుల్లో ప్రతి దానికి ఈయాన పేరు జోడించటం ఇంతకంటే చాలా చాలా బావుంటుంది.

౩. ఇక నుంచీ ప్రజలకి ఉపయోగార్ధం కట్టబడే కట్టడాలకీ , రోడ్లకీ మొ ఆయన పేరు పెట్టుకోవచ్చు. "రాజశేఖర్ రహదారి" అంటూ రాష్ట్ర రహదారులకు (కొత్తవి కట్టి :) ) పేర్లూ పెట్టుకోవచ్చూ!

ఇలా ఎన్నో ఇతర అవకాశలతో నాయకుడిపై ప్రేమను, అభిమానాన్ని చూపుకునే అవకాశాలుండగా, చచ్చిన ప్రతినాయకుడి పేరుకోసం ఆల్రెడీ ఉన్న వాటికే పేరు మార్చడం అన్నది చాలా ఛండాలంగా ఉంది.

అలాగే కరీంనగర్ పేరు మార్చడం గురించి కూడా కొందరు అనవసర చర్చలు చేసారు. అది కూడా వేస్టు. శుద్ద దండగ. ఆ జిల్లా పేరు కరీంనగర్ గానే ఉండనియ్యండి. పివి నరసింహారావుగారు పేరుని మన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడదాం అన్నప్పుడు, అది పడనివ్వ లేదు. తెలుగుదేశంవారే, మరో కాంగ్రేసు వాడి పేరు ఆలోచించినా, కాంగ్రేసు వాళ్ళు ఒప్పుకోకపోవటం - అధిష్టానంపై విధేయత ప్రకటించడం - లాంటి రాజకీయ కారణాల వల్ల జరిగింది. అలాంటి రాజకీయ కారణాలను నేను చర్చించను.

ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అసలు గొప్ప నాయకుడా లేక క్రిమినల్లా అంటూ అస్సలే చర్చించను. ఆయన గొప్ప నాయకుడే ననుకొని, ఆయన పేరు దేనికన్నా పెడదాం అనుకున్నా - ఇలా జిల్లాల పేర్లు మార్చడం కాకుండా, ఏదేని ప్రాజెక్టుని యుద్ద ప్రాతిపదికన ముగించి, దానికే ఆయన పేరు పెట్టి జాతికి అంకింతం ఇవ్వడం అనేది మరింత సంమంజంసంగానూ, ముదావహంగానూ ఉంటుందని విన్నవించుకుంటున్నాను. కడప జిల్లా పేరు మార్చ వద్దని అర్ధిస్తున్నాను.

ప్రాజెక్టులు అవ్వవేమో అని అనుమానమున్నా - ఏదో ఓ మంచి పనిగా చేసిన నిర్మాణం ఈ సరికి తయారవుతూ ఉండి ఉండే ఉంటుంది - దానికి ఆయన పేరు పెట్టండీ అని అభ్యర్ధిస్తున్నాను. అది అంత ఘనంగా లేదని అసంతృప్తిగా ఉంటే, ఏదేనీ ఘనమైన ప్రాజెక్టుని తలపెట్టి, సంవత్సరంలోగా ముగించి, ఆయన డెత్ యానివర్సరీ కల్లా, ఆయన పేరుతో జాతికి అంకింతం ఇచ్చి, ఆయన గొప్పదనాన్ని ఇనుమడించేలా చెయ్యమనీ మనవి.

ఈ విన్నపానికి రాజాధిరాజు! రాజశేఖరు! ని ఆమోదం కలగాలని ప్రార్ధిస్తున్నాను.

3 comments:

  1. మీ సూచనలో సగమే నాకు ఆమోదయోగ్యం. కారణం -యోగ్యత, నిర్మాణంలో ఉన్నదానికైనా అతడి పేరు పెట్టడానికి అతడికున్న యోగ్యతేమిటి అనేది. అయితే మీరు దాన్ని చర్చించనన్నారు కబట్టి ఇక చెప్పేదేం లేదు. :)

    ReplyDelete
  2. ఒకరి పేరుతో ఏదన్నా ఉంటే అతని పేరు మరి దేనికీ పెట్టకూడదని రూలుండాలి. బొంబాయిలో ఎక్కడి కెళ్లినా శివాజీ పేర్లే. ఆంధ్రాలో ఎక్కడికెళ్లినా రాజీవ్ పేర్లే. గందరగోళం.

    ReplyDelete
  3. //ఆయా ప్రాజెక్టుల్లో ప్రతి దానికి ఈయాన పేరు జోడించటం ఇంతకంటే చాలా చాలా బావుంటుంది.

    ఏమాత్రం బాగోదు. ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేరెందుకండీ!
    ఆ ప్రాంతపు పేర్లు ఐతేనే బాగుంటుంది. కానీ అలా రాజకీయ నాయకుల పేర్లు పెట్టకుండా ఊరుకుంటారా?

    ReplyDelete